Rentala Jayadev
సంపూర్ణ దక్షిణ భారతీయ సినిమా తొలి అడుగుల రికార్డు ' మన సినిమా... ఫస్ట్ రీల్ ' పుస్తకం. పాతికేళ్ళ పరిశోధనా ఫలితమైన ఈ రచన అత్యంత సాధికారత, ప్రామాణికత, ఖచ్చితత్వం కలిగిన సినీ చరిత్ర పుస్తకం.
మూకీల నుంచి టాకీల దాకా శతాధిక వసంతాల భారతీయ సినిమా అసలు సిసలు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలంటే ' మన సినిమా... ఫస్ట్ రీల్ ' పుస్తకం తప్పక చదవాల్సిందే. మనం విస్మరించిన మన చరిత్రలోని అనేక కొత్త అంశాలు ససాక్ష్యంగా వెల్లడించిన పుస్తకం ఇది. తప్పకుండా ఈ పుస్తకం లో మీకు నచ్చే, మిమ్మల్ని చదివింపచేసే సమాచారం వుంటుంది.
పుస్తక రచనను కేవలం తెలుగు సినిమాకే జయదేవ పరిమితం చేయలేదు. తమిళ, కన్నడ, మలయాళ సినీ చరిత్ర, అక్కడి తొలి చిత్రాలకు కూడా తన పరిశోధనను ఆయన విస్తరించారు. మూకీ చిత్రాలు, తొలి భారతీయ టాకీ 'ఆలమ్ ఆరా' (1931మార్చ్14)లతో మొదలుపెట్టారు. తమిళులు తమ చరిత్రలో కలిపేసుకుంటే, తెలుగు వాళ్ళు తమ చరిత్రను వదిలేసుకున్న 'కాళిదాస్' చిత్రం గురించి వెలుగులోకి తెచ్చారు.
తమిళ, కన్నడ, మలయాళ సినీ రంగ చరిత్రలోనూ ఇప్పటి దాకా ప్రచారంలో ఉన్న అనేక తప్పులను వెలికితీసి, సరిదిద్దారు.
తొలి కన్నడ చిత్రం 'సతీ సులోచన', మొదటి మలయాళం టాకీ 'బాలన్' విశేషాలను వివరిస్తూనే... దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల ఆదానప్రదానాల గురించి, ఇతర భాషా చిత్రాల ప్రభావాల గురించి, సోదాహరణంగా వివరించారు.
దాదాపు 2 వేల దాకా బొమ్మలు కలసి మొత్తం 566 పేజీలున్న ఈ పుస్తకాన్ని మరింత ఆసక్తిదాయకంగా మార్చాయి.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పుస్తకాన్ని రాసిన తీరు. 'తారీకులు... దస్తావేజుల' పరిశోధనా గ్రంథంలా కాకుండా చక్కగా చదివించడానికి రచయిత తీసుకున్న జాగ్రత్త ప్రతి పేరాలో కనిపిస్తుంది. మనకు తెలియని ఒక (సినీ) చారిత్రక విషయం కనిపిస్తుంది, వెనువెంటనే మనకు తెలిసిన ఓ సినిమా విశేషం మురిపిస్తుంది. పాత్రికేయునిగా జయదేవ అనుభవం... దీన్ని సినిమా కథల పుస్తకంగా రూపుదిద్దింది.
దాదాపు 2 వేల దాకా ఫోటోలు, అరుదైన సమాచారం, చరిత్రను సరిదిద్దే అనేక కొత్త పరిశోధనాత్మక వాస్తవాలున్న ఈ పుస్తకం ధర ఫోటోకు పావలా చొప్పున వేసుకున్నా… పాఠకులకు భలే మంచి చౌకబేరమే!