Out of Stock
హంస ఆకాశమునపోవుచు
ఒక కుండను ఒక పండును
ఒక కొండను చూచెనట!
దమయంతి, శ్రీ:, చంద్రకళ
ఒక్కటేనట!
- శేషేంద్ర
*****
- సంస్కృతంలోని హర్షనైషధ కావ్యంలో ఎనిమిది శతాబ్దాల నుండి మరుగున పడిఉన్న మహారహస్యం
- 800 ఏళ్ళ నుంచి హంస తన కథ వినిపిస్తున్నా ఎవరూ గుర్తించలేదు
- శ్రీ హర్షుడు శ్రీ విద్యోపాసకుడు
- హర్ష నైషధం మంత్రయోగ వేదాంత శాస్త్ర సంపుటి
- దమయంతి దమయంతి కాదు శ్రీ మహా త్రిపురసుందరి
- ఈ కావ్యంలో నిక్షిప్తమై ఉన్న అజపా గాయత్రి, చింతామణి, తిరస్కరిణి మంత్రాలు
- “అవామావామార్థే” గర్భంలో రత్నరాసులు దాచుకున్న సముద్రంలాంటి శ్లోకం
*****
మహాకవి శేషేంద్ర విరచిత షోడశి రామాయణ రహస్యములు, స్వర్ణహంస హర్షనైషద కావ్య పరిశీలన ప్రపంచ సాహితీ విమర్శలో రెండు మహోన్నత శిఖరాలు. సమకాలీన తెలుగు సాహిత్య ప్రజానీకానికి ముఖ్యంగా నేటి తరానికి తెలియని సత్యమిది. వాల్మీకి రామాయణంలో కుండలినీ యోగం, గాయత్రీమంత్రం తదితరాలు సాక్ష్యాత్కరించినట్లే శేషేంద్రకు హర్షుడి నైషధంలో మంత్రయోగ తంత్ర సంపుటి, శ్రీ మహాత్రిపుర సుందరి, చింతామణి తిరస్కరిణి మంత్రాలు సాక్ష్యాత్కరించాయి.
డిగ్రీల ఉత్పత్తి కేంద్రాలయిన మన విశ్వవిద్యాలయాలు రీసెర్చ్ పేరుతో టన్నుల కొద్దీ ‘‘సాలిడ్ వేస్ట్’’ కుమ్మరిస్తుండగా శేషేంద్ర మున్సిపల్ కమీషనర్ నౌకరీ చేస్తూనే ఋషిగా దార్శినిక పరిశోధనాత్మకత విమర్శ గ్రంథాలు సృజించారు.
ప్రచురణ రీత్యా షోడశి (1967) స్వర్ణహంస (1968) వెలువడ్డా రచనాకాలం దృష్ట్యా స్వర్ణహంస తొలికావ్యం. నన్నయ్య, శ్రీనాథ, మల్లినాథులకు దొరకని రహస్యాలు శేషేంద్రకు సాక్ష్యాత్కరించాయి. ఈ మహనీయత్రయం నైషథంలోని రహస్యాలను తనకు విడిచిపెట్టి వెళ్లడం తన పూర్వజన్మ పుణ్యఫలమని అంటారు శేషేంద్ర వినమ్రంగా.
"ఈ రెండు మహా కావ్యాలు, ఆనాడు కీ.శే. నీలంరాజు వెంకటశేషయ్య గారి సంపాదకత్వంలోని ఆంధ్రప్రభ దినపత్రికలో 1963 నుంచి 1966 వరకూ ధారావాహికంగా, ఆదివారం సాహిత్యనుబంధంలో వెలువడ్డాయి. శేషేంద్ర పద్య, గద్య కావ్యాలన్నీ కూడా (సుమారు 6 పుస్తకాలు ) ప్రభలో వెలువడ్డ తరువాతే పుస్తక రూపంలో ప్రచురితమయ్యాయి".
తొలిముద్రణ 1968లో, రెండవముద్రణ 1999లోనూ జరుపుకున్న ఈ "స్వర్ణ హంస" కావ్యం మూడవ ముద్రణ ఈ-బుక్ రూపంలో మహిషాసురమర్ధిని ఆశీస్సులుతో శేషేంద్ర కుమారుడు సాత్యకి మనకి అందిస్తున్నారు.