Shodasi :Ramayana Rahasyalu | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Shodasi :Ramayana Rahasyalu

Out of Stock

Author:Gunturu Seshendra sharma

మానవాళికో పరమౌషధం... వాల్మీకీ ‘రామాయణం’

రామాయణం కథ ఒక పాఠ్యాంశంగా పిల్లల చేత చదివిస్తారు. సీతారాముల్ని ఆదిదంపతులుగా పెద్దలు కొలుస్తారు. ఇక పారాయణం సంగతి చెప్పనక్కర్లేదు. వాల్మీకి రామాయణాన్ని ఒక సులభమైన కథగా చెప్పి ఊరుకున్నాడా? కాదంటున్నారు శేషేంద్రశర్మ.

వాల్మీకి రామాయణం అంతరాత్మ అవగతం అవడానికి శాస్త్ర పరిజ్ఞానం అవసరమని, అందులో రహస్యంగా దాగి వున్న రుషి హృదయం. శాస్త్ర పరిజ్ఞానం ద్వారానే ఆకళింపునకు లొంగుతుందని విశ్లేషించారు. మరి శాస్త్ర పరిజ్ఞానం అందరికీ అందేది కాదు కదా!

‘‘శాస్త్రములు పండితుల కొరకే’’ అన్న వాదం ‘‘కొందరు స్వార్థపరులైన పండితులు, కొందరు సోమరులైన పామరులు కలిసి చేసిన కుట్ర, కల్పించిన భ్రాంతి’’ అన్నది శేషేంద్రగారి నిశ్చితాభిప్రాయం. సాహిత్యం, శాస్త్రం పట్ల ఇలాంటి నిజాయితీ యుతమైన ప్రజాస్వామిక దృక్పథం ఉన్న శేషేంద్ర రామాయణంలో వాల్మీకి దాచిన రహస్యాల్ని ప్రజానీకానికి విడమరిచి చెబుతున్నారు. వాల్మీకి మహర్షి కుండలినీ యోగమనే పరమౌషధాన్ని మానవాళికి బహూకరించాడని, అనుష్టుప్‌ ఛందస్సులో ఉన్న వాల్మీకి కవిత ఆ ఔషధానికి తేనెపూత అనీ అనన్య అంతర్మథనంతో, అసాధారణ విద్వత్తుతో వ్యాఖ్యానించారు. రామాయణంలో వాల్మీకి ధ్యాన పద్ధతిని ప్రతిపాదించాడని, రామాయణం భారతంకంటే పూర్వ గ్రంథమనీ, వేదానికి రూపాంతరమనీ తేల్చి చెప్పారు. శేషేంద్రలోని అంతర్ముఖత్వం, పరిశీలాన్వేషణా చాతుర్యం రెండు పాయలుగా గ్రంథమంతటా విస్తరించాయి. ప్రతిభా పాండిత్యాల పారవశ్య పరిమళం గ్రంథమంతటా గుబాళిస్తుంది. ఋతుఘోష వంటి అరుదైన పద్యకావ్యం, మండే సూర్యుడు వంటి సంచలనాత్మక వచన కవితా సంకలనం వెలువరించిన శేషేంద్రలోని మంత్ర శాస్త్రం, వేదవాంగ్మయంలో విద్వాంసుడన్న కోణం ఈ గ్రంథం ద్వారా నేటితరం వాళ్ళు తెలుసుకోవచ్చు.

 

సర్వకళా సంశోభితం

భారతీయ విమర్శనా సాహిత్యాన్ని ప్రపంచ వాజ్ఞ్మయంలో నిలువెత్తు నిలబెట్టిన అత్యుత్తమ గ్రంథమిది. ‘షోడశి’ అనేది మహామంత్రానికి సంబంధించిన నామం. ఈ పేరును బట్టే ఇదో అధ్యాత్మ ప్రబోధగ్రంథమని గ్రహించవచ్చు. వాల్మీకి శ్రీమద్రామాయణాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత శాస్త్రపరిజ్ఞానం అవసరమో ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. అంతేకాదు, వైదికవాజ్ఞ్మయం మీద అధికారం ఉండాలి. శేషేంద్రశర్శగారి లోతైన పరిశీలనా దృష్టిని, పాండిత్యాన్ని సాక్షాత్తు...... కథాసందర్భం, పాత్రల మనోగతం, ఆనాటి కాలం, విశేషమైన శాస్త్ర పాండిత్యం, శబ్దాధికారం, వీటికి తోడు లౌకిక వ్యవహారాలు ఇన్ని తెలిస్తే కాని వాల్మీకి పదప్రయోగాలను అవగతం చేసుకోలేమని శర్మగారు తేటతెల్లం చేశారు. దీనికి మకుటాయమానం ‘నేత్రాతుర:’ అనే శబ్దం మీద నిర్వహించిన చర్చ. సుందరకాండ పేరులో విశేషం, కుండలినీ యోగం, త్రిజటా స్వప్న వృత్తాంతంలో గాయత్రీ మంత్ర రహస్యం, భారతాన్ని రామాయణానికి ప్రతిబింబంగా భావించడం ` ఇలా ఎన్నో విమర్శనా వ్యాసాలు.. ఇతరుల ఊహకు కూడా అందనివి ఇందులో ఉన్నాయి. తెలుగు సాహితీ లోకం చేసుకున్న పుణ్యఫలం ఈ గ్రంథరాజం.

విపుల , విశ్వకథా వేదిక, మే, 2014

 

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out