రాజిరెడ్డి వాక్యాలు ఎక్కువ లోపలి వైపే చూస్తాయి. అక్కడ కనపడిందాన్ని ఏ అలంకారమూ దిగేయకుండా ఉన్నదున్నట్టుగానే పట్టుకోవాలని అతని ప్రయత్నం. ఈ ప్రయత్నంలోని నిష్ట ఎంత శుద్ధమైనదంటే, అది కథా కవితల్లాంటి ఇంకే తోవల్లోనూ ఇమడక తనదైన ప్రక్రియల్ని కూడా వెతుక్కుంటోంది. ఈ ప్రయత్నంలోంచి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త గొంతు, తెలుగు వచనానికి ఒక కొత్త వాక్యమూ సమకూరాయి. సాక్షి ఫన్ డేలో ఆయన రాసిన స్థల పురాణాలు (ముఖ్యంగా హైదరాబాదు స్థలపురాణాలు) ఇప్పుడు పుస్తకంగా వెలువడ్డాయి. బహుశా ఇప్పటి హైదరాబాదుని తనలో బిగించి పట్టుకున్న కాలనాళికగా మున్ముందు ఈ పుస్తకం నిలిచిపోతుందేమో.