మన కాలపు మహా ఇతిహాసం
ప్రపంచ ప్రఖ్యాత రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ సృష్టించిన అద్భుత నవల ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్.’ దీనికి పి. మోహన్ చేసిన తెలుగు అనువాదం ఇది. ‘వందేళ్ల ఏకాంతం’ ఇప్పటికి యాభైకి పైగా భాషల్లో అనువాదమై ఐదు కోట్ల ప్రతులు అచ్చయింది. మేజిక్ రియలిజం పేరు వినగానే ఇదే గుర్తొస్తుంది. ప్రపంచం దీన్ని మనకాలపు మహా ఇతిహాసమని కొనియాడింది. మానవుడి ఊహాశక్తికి తిరుగులేని నిదర్శమని అబ్బురపోయింది.
అద్భుత కల్పన, వ్యంగ్యం, రక్తపాత యుద్ధాలు, మోహాలు, సైన్సు, మూఢనమ్మకాలు కలబోసుకున్న ఈ నవలకు భారతదేశంతో బీరపీచు సంబంధం ఉంది. కథ ప్రకారం ఈ రచన మెల్కియాదిస్ అనే ఇంద్రజాలికుడు సంస్కృతంలో రాసిన గాథ. "పందితోక పిల్లాడు పుట్టకుండా ఓ కుటుంబం వందేళ్లపాటు ఎన్ని తిప్పలు పడిందో చెప్పడానికే ఈ నవల రాశాను," అన్నాడు మార్క్వెజ్. సరదాగా అనిపించినా నిజమైతే అదే. ఈ నవల్లోని పాత్రలు, అవి జీవించిన మకోందో విశ్వవ్యాప్తం. అందుకే 'వందేళ్ల ఏకాంతం' ప్రతి మనిషి ఏకాంతం, మకోందో చరిత్ర ప్రతి ఊరి కథ అయింది.