Maruthi Pourohitham
ఎచట శిలలు కవితా గానం
చేయునో
ఎచట శిల్పాలు సంగీత జావళులు ఆలపించునో అదే… హంపి
చాలా కాలం కిందట హంపీలోని శిలలను , శిల్పసంపదనూ చూస్తూ రాసుకున్న మాటలు. హంపీకి మా ప్రయాణం, హంపీతో మా ప్రణయం మాటలకందనిది.
మారుతీ పౌరోహితం గారు తన అక్షర కుసుమాలతో ప్రణయ హంపీని విరబూయించారు. ఈ ఊసులన్నీ ఆ ప్రణయ హంపీ గురించే.
ప్రణయ హంపి చారిత్రక కల్పనాత్మక నవల. ఓ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వందేళ్లకు ముందు వెలువడిన తొలి తెలుగు చారిత్రక నవల దుగ్గిరాల రామచంద్రయ్య గారి “విజయనగర సామ్రాజ్యం “ కూడా ఇదే చారిత్రక నేపథ్యంతో వెలువడినదే.
తెలుగు సాహిత్యంలో ఇప్పుడు చారిత్రక కల్పనాత్మక రచనల కాలం నడుస్తోందని చెప్పాలి. ఇటీవలి కాలంలో పాఠకుల ముందుకు వచ్చిన శప్తభూమి, బోయకొట్టంబులు పండ్రెండు, తేజో తుంగభద్ర, లేపాక్షి, పట్టుతోవ , ప్రాచీన గాథలు మొదలైనవన్నీ ఈ కోవకు చెందినవే .
ప్రణయ హంపీ యద్ధము, ప్రేమ నేపథ్యంలో నడుస్తుంది. నేటి ప్రపంచంలో నడుస్తున్న విషయాలే ఇవన్నీ. సమాజ పరిణామంలో యుద్ధాలు , అంతర్యుద్ధాలు సృష్టించిన రక్తపాతం, జరిగిన ప్రాణ నష్టం , మనోవేదన అంతా ఇంతా కాదు. అంత విషాదంలోనూ ప్రేమకు చోటుంటుంది. ప్రపంచ ప్రసిద్ధ నవల “యుద్ధము -శాంతి” కూడా రష్యా- నెపోలియన్ యుద్ధ నేపథ్యంలోనే సాగుతుంది. యుద్ధసంక్షోభంలో ప్రేమ, మానవ భావోద్వేగాలు, నాటి సమాజ తీరుతెన్నులను గొప్పగా వివరిస్తారు లియో టాల్ స్టాయ్.
ప్రణయ హంపీ రచయిత యుద్ధ విషాదంతో ముడివడిన జీవితాల్లోని మానసిక సంఘర్షణల నేపథ్యంలో నవలను నడిపిస్తాడు. యుద్ధానికి ఎక్కడా మతం రంగు పులమడు . అంత శోకంలోనూ మతం ప్రేమనే బోధిస్తుందని చెబుతూ ఓ సూఫీ సైన్యాధ్యక్షుని ద్వారా నాయికా నాయకులను హృద్యంగా కలుపుతాడు.ఇక్కడ మతాతీతమైన మానవత్వం మాత్రమే కనబడుతుంది. వర్తమాన భారతావనికి ఇది అవసరం కూడానూ. బహుశా రచయితకున్న సామాజిక ,రాజకీయ అవగాహనే దీనికి కారణం కావచ్చు.
ప్రణయ హంపీ చేతిలో అందంగా ఇమిడిపోయే 133 పేజీల నవల.ఇలా ఎందుకంటున్నానంటే నేను చదివిన, నాకిష్టమైన చాలా నవలలు ఇటువంటివే. యానిమల్ ఫాం, ఆల్కెమిస్ట్ , ఇల్యూషన్స్, సీ గల్ , ఒల్డ్ మాన్ అండ్ ద సీ, మెటమార్ఫోసిస్, ద గ్రేట్ గాట్స్ బై వాటిలో మచ్చుకు కొన్ని . వీటన్నింటిలో రాశి కున్నా వాసి మిన్న గా కనబడుతుంది.ఇవన్నీ రాశిలో పెద్దవైన గాన్ విత్ ద విండ్, డాన్ క్విక్సోట్ , వార్ అండ్ పీస్ , అన్నా కరనీన మొదలైన వాటి సరసన సగర్వంగా నిలబడేవే . ప్రణయ హంపీ విషయ సాంద్రత అధికంగా వున్న నవల.బహుశా ఈకారణం చేతనే పరిమాణం తగ్గి వుండవచ్చు.
చారిత్రక రచనల్లో అప్పటి చరిత్ర సంస్కృతులను కొంతమేరకైనా పాఠకులకు అందించగలిగితే రచయిత విజయం సాధించినట్లే. మారుతి గారు తన నవలలో నాటి విజయనగర సామ్రాజ్య చరిత్ర, సంస్కృతులను కళ్లకు కట్టినట్లు వివరిస్తారు. నవలలో కాల్పానికత కంటే వాస్తవికతే ఎక్కువగా కనబడుతుంది.
నవల దసరా వేడుకలకు ముస్తాబైన హంపీ నగర వర్ణణతో ప్రారంభమవుతుంది.
పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన డొమింగో పేస్ ఆనాటి హంపీ నగరాన్ని వర్ణిస్తూ రతనాల రాశుల కాంతితో నగరం మెరిసిపోతోందంటాడు. మన మారుతి గారేమో తుళ్లిపడుతున్న యవ్వనం వీధుల్లో కుప్పబోసినట్లు నగరం మిడిసిపడుతోందంటూ హంపీ నగరాన్ని వర్ణిస్తూ నవలను ప్రారంభిస్తారు జరగబోయే ప్రణయానికి ప్రతీకగా.
నగర వర్ణనతోనే ఆగిపోకుండా ఆనాటి ఆహారం, ఆహార్యం, రాజకీయ, ఆర్థిక , సామాజిక , సాంస్కృతిక అంశాలన్నింటినీ చక్కగా పూసగుచ్చినట్టుగా వివరిస్తారు.
శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదలో ఆనాటి భోజనాన్ని వర్ణిస్తూ ..చుయ్ అనే తాళింపు చప్పుడు ఆగకుండా వండిన మిరియాల పొడి చల్లిన కూరలు ,ఆవపిండి తాళింపులు , ఊరుగాయలు, రకరకాల బియ్యంతో చేసిన అన్నంపై చెయ్యి సురుక్కుమనేలా వేడిచేసిన నెయ్యి కలుపుకుని తింటుంటే … ఆహా ! చదువుతోంటేనే మనక్కూడా నోరూరుతోంది కదా! ప్రణయ హంపీలో మన మారుతి ఇద్దేనలు, దోసీయలు,పులగం, పాయసం ,చారు, వడియాలు, అప్పుడే మనదేశం లోకి వచ్చిన పోర్చుగీసు వారి మిరపకాయల చిత్రాన్నం అంటూ ఆనాటి వంటలను ఏకరువుపెడతారు. ఇంకా యుద్ధభూమిలో పొట్టేలు, అడవి పంది , కుందేలు మాంసాన్ని కాలుస్తోంటే వచ్చే కమురు వాసనలను కూడా మన ముక్కు పుటాలదాకా తెస్తాడు.
ఆనాటి దుస్తులు, గృహాలంకరణ , ఆభరణాలు, ఆటలు, రంగస్థలం వ్యవసాయం రంగం తీరుతెన్నులు, పన్నులు, వాణిజ్యం , కుల సంస్కరణ , స్త్రీల స్థితిగతులు , వేశ్యల దీనస్థితి మొదలైన ఎన్నో సామాజిక స్థితిగతులను చాలా సహజంగానే మన ముందుంచుతారు. ప్రజలపై వేసిన పన్నులు , అవి కట్టలేక కుదేలైన రైతాంగం దీన స్థితి నవలలో కనబడుతుంది. అళియ రామ రాయల అంగరక్షకుడిగా అవతారమెత్తిన మన సంబజ్జగౌడ కూడా రైతుబిడ్డడే. వ్యవసాయం గిట్టుబాటు కాకనే ఈ వృత్తిని ఎంచుకున్నట్టు ఆయనే స్వయంగా చెబుతారు. మసాల దినుసులు , మిరియాల వ్యాపారం ప్రాధాన్యతను వివరించిన తీరు అద్భుతం. వెనీసు నగరంలో కట్టిన గొప్ప భవనాలన్నీ ఈ వ్యాపార లాభాలవల్ల కట్టినవే నని చెబుతారు. వాటినొకసారి చూడాలనే కోరికను కూడా నాలో పుట్టించారు. నాటి విజయనగర సామ్రాజ్యంలో వేశ్యావృత్తికున్న ప్రాధాన్యతను రంగసాని , వలంది పాత్రల ద్వార అర్థమయ్యేట్టు చేస్తారు.
భారతీయ సాహిత్యంలో వేశ్యల పాత్రచిత్రణకు గొప్ప ప్రాధాన్యత వుంది. ఆమ్రపాలి, వసంతసేన , మన మధురవాణి మొదలగు పాత్రలు ఎంతో ఉదాత్తంగానూ, హృద్యంగాను కనబడతాయి . ప్రణయ హంపీ లోని వలంది పాత్రను కూడా రచయిత అంతే ఉదాత్తంగా మలిచారు.వలంది సంబజ్జగౌడల మధ్య జరిగిన సంభాషణ కన్యాశుల్కంలో మధురవాణి సౌజన్యారావు పంతుల మధ్యజరిగిన సంభాషణకు తక్కువ కాదన్నట్టనిపించింది. ముద్దుకుప్పాయి -సంబజ్జగౌడ కూతురుకు వలంది అని నామకరణం చేయడంతో నవల ముగుస్తుంది . అదో గొప్ప ముగింపు.అంతేకాదు వలంది త్యాగానికి అది సరైన నివాళి కూడా. ఆ ముగింపు గురజాడ వారి పూర్ణమ్మ మాటలు “నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొకపరి తలవండి" చరణాన్ని గుర్తుకు తెస్తుంది.
సంబజ్జ గౌడ ముద్దుకుప్పాయిల ఆదర్శప్రాయమైన ప్రేమ ప్రధాన ఇతివృత్తంగా నవల నడుస్తుంది . శారీరక ఆకర్షణతో ,తొలి చూపు ప్రేమగా మొదలైన వీరి ప్రేమ అభిరుచులను పంచుకునే క్రమంలో సాన్నిహిత్యం పెరిగి మానసింగా బలపడుతుంది . కనకదాస సంస్కరణలతో మొదలెట్టి నృత్యరూపకాల ప్రయోజనాలు, యుద్ధాల దాకా ఎన్నోవిషయాల గురించి చర్చించుకుంటారు. కులాంతర వివాహాలపై చర్చ ఆసక్తి కరం.వీరి ప్రేమలో నిజాయితీ, నిబద్ధత కనబడతాయి. రచయిత ముద్దుకుప్పాయిని భామాకలాపం నాట్యకారిణిగా చిత్రీకరించడం పాత్రోచితం. భామాకలాపం ముఖ్య ఉద్దేశ్యం సత్యభామ కృష్ణుని ప్రేమను పొందడమైతే నవలలో ముద్దుకుప్పాయి బామాకలాపం ప్రదర్శన ద్వారా బీజాపూర్ సామ్రాజ్యంలో యుద్ధఖైదీగా వున్న సంబజ్జగౌడను పొందడం పరాకాష్ట.
నవలకు నేపథ్యమైన రాక్షసి తంగడి యుద్ధాన్ని చక్కగా అక్షరీకరిస్తారు రచయిత . యుద్ధమంటేనే రక్తమాంసాలపై దాడి, అంతులేని శోకం, పెను విషాదం. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రీకుడు న్యూనిజ్ అక్కడి మైదానాల్లో రక్తం ఏరులై పారిందని రాస్తాడు. ఇంత శోకాన్ని సంబజ్జగౌడ అంతే విషాదంగా
”యుద్ధం ఏమి మిగిల్చింది శ్రమ, చెమట , రక్తం కన్నీళ్లు తప్ప “ అంటాడు .
యుద్ధ ఘట్టాలను చదువుతున్నపుడు తిక్కన మహాభారత రచనలో కనబరచిన నాటకీయత కనబడుతుంది.
వేదమంత్రోచ్ఛారణ మధ్య యుద్ధం ప్రారంభం కాక ముందే అలీ అదిల్షా మహాల్దర్ రాయబారం, యుద్ధ నియమాలు, యోధుల యుద్ధభేరి నాదాలు, శంఖారావాలు, ఏనుగుల ఘీంకారాలు, గరుడ గరుడ నినాదాలు, యుద్ధవ్యూహాలు, ద్రోణ సంహారంలో వాడిన “అశ్వత్థామ హతః కుంజరః” రీతిలో అళియ రామరాయల చెవిలో “ మీ పెద్ద కుమారుడు కృష్ణప్ప యుద్ధంలో మరణించాడని” దళవాయి అబద్దమాడడం మొదలైనవన్నీ కురుక్షేత్ర సంగ్రామంలో కనబడే ఘట్టాలే .
ఎక్కడైనా యుద్ధం ఏం మిగిలిస్తుంది? విషాదం, విధ్వంసం తప్ప, ఇక్కడా అదే జరిగింది. ధరిత్రి పై సాటిలేని హంపీ నగరం మళ్లీ కోలుకోలేనంతగా విధ్వంసమైంది. ప్రజలు చెల్లాచెదురైపోయారు . వీరులు యుద్ధ ఖైదీలయ్యారు. అంతా శ్మశానం నిశ్శబ్దం. నేడు….మళ్లీ అవే యుద్ధమేఘాలు మన గగనతలమంతా అలముకుంటున్నాయు. ఈ చీకట్లు మనందరినీ ఎచట మేల్కొలుపునో……
అమావస్య చీకట్లో మొదలైన రాక్షసి తంగడి యుద్ధం ఎన్నడో ముగిసిపోయింది. రక్తసిక్త హంపి గాయాలూ మాసిపోయాయి, విరూపాక్షేశ్వర ఆలయంలో పూజలూ మొదలయ్యాయి …
కానీ నేటికీ
యద్ధభయం లేని భూమి ఎక్కడా కనబడదు….
యుద్ధమరకలే లేని ఈ నేల పై
ప్రేమలు చిగురించే దెన్నడో
ఆక్రందనే లేని ఈ ధరిత్రి నిండా
శాంతి కుసుమాలు వికసించేదెప్పటికో
చిరు పాపల నిదురకనులపై
చిరునవ్వులు కురిసేదెన్నటికో …
ప్రణయహంపీ లాంటి ఎన్నిరచనలు రావాలో కదా! ఈ నియంతల
మనసు మారడానికి,
యుద్ధం లేని రేపటికోసం…
జయచంద్ర
రాధ స్కూల్ ఆఫ్ లెర్నింగ్,
అనంతపురం.
9490121488